Published July 15, 2023 by

మట్టు - మర్యాద

పూర్వం ఒక ఊరిలో సుఖదాసు అనే పేద రైతుకు కుమారవర్ధనుడనే కుమారుడు ఉండేవాడు. చదువు పూర్తయ్యాక కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండవలిసిందని సుఖదాసు తన కుమారుడితో చెప్పాడు. దీంతో కుమారవర్ధనుడు మంచి కొలువుకోసం ప్రయత్నాలు చేశాడు. అతడు హర్షగుప్తుడనే వ్యాపారి వద్దకు వెళ్లాడు. హర్షగుప్తుడు మరొక వ్యాపారి రత్నాచారికి కుమారవర్ధనుడి గురించి సిఫారసు ఉత్తరం రాసి ఇచ్చాడు. కుమారవర్ధనుడు తర్వాత రత్నాచారిని కలిశాడు. సిఫారసు లేఖ ఉన్నప్పటికీ ప్రయాణం కారణంగా అతడి బట్టలు మురికిగా మారటం అతడు మాట్లాడే భాష కాస్త మొరటుగా ఉండటం రత్నాచారి గమనించాడు. అతడికి ఉద్యోగం ఇచ్చేదీ లేనిదీ తర్వాత చెబుతానని చెప్పాడు. తనకు ఇక ఉద్యోగం రాదని కుమారవర్ధనుడు అర్థం చేసుకున్నాడు.

తిరిగి హర్షగుప్తుడి వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పాడు కుమారవర్ధనుడు. ఉద్యోగాన్ని ఆశించి వెళ్లేటప్పుడు చక్కటి, శుభ్రమైన దుస్తులను ధరించి వెళ్లాలని, మృదువుగా మాట్లాడాలని, భాషలో తప్పులు లేకుండా చూసుకోవాలని హర్షగుప్తుడు సలహా ఇచ్చాడు. మనుషులు తమను తాము ఎలా ప్రదర్శించుకోవాలో అతడు కుమార వర్ధనుడికి సూచించాడు. మనిషి మాట్లాడే ప్రతి మాటనూ ప్రపంచం అంచనా వేస్తుంటుందని తెలిపాడు. ఈసారి అతడు సుమంగళుడు అనే మరొక వ్యాపారవేత్తకు సిఫారసు ఉత్తరం రాసి ఇచ్చాడు. కుమారవర్ధనుడు తనకు హర్షగుప్తుడు ఇచ్చిన సూచనలను తుచ తప్పకుండా పాటించాడు. సుమంగళుడి వద్ద కార్యదర్శి పదవి సంపాదించాడు కూడా. లోకంలో మర్యాద మన్ననలకు ఉన్న విలువ ఏమిటో అతడు అర్థం చేసుకుని హర్షగుప్తుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

Read More
Published July 15, 2023 by

రహస్యం

పెసరపాడు గ్రామాధికారి భూషయ్య ఏడేళ్ళ కూతురు కమల తండ్రి వద్దకు వచ్చి, 'నాన్నా, రహస్యం అంటే ఏమిటి?’ అనడిగింది. 'ఎందుకూ?' అనడిగాడతను. కమల తన స్నేహితురాలు వనజ ఇంట్లో ఆడుకుంటూంటే, ఒకావిడ వచ్చి వనజ తల్లితో, ఏదో చెప్పబోయింది. అప్పుడు వనజ తల్లి పిల్లలతో, ‘రహస్యాలు పిల్లలు వినకూడదు. బైటకు వెళ్ళి ఆడుకోండి,' అంది.

'సమాచారం, రహస్యం అంటే ఏమిటి నాన్నా?' అనడిగింది కమల. భూషయ్య ‘వాటి అర్థం తరువాత చెబుతాను కాని, ముందు నువ్వు రచ్చబండ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న వారందరితోనూ సాయంత్రం నేను మామిడితోపు దగ్గరకు రమ్మన్నానని చెప్పిరా,” అన్నాడు. కమల వెంటనే పరుగెత్తుకు వెళ్ళి చెప్పి వచ్చింది.

కాసేపటి తరువాత భూషయ్య కొబ్బరితోటకు వెళ్తూ కూతుర్ని కూడా రమ్మన్నాడు. త్రోవలో ఓ ఇంటి వద్ద ఆగి, ఆ ఇంటి ఆసామీని పిలిచాడు. అతను బైటకు రాగానే, గొంతు తగ్గించి, ‘వచ్చే నెలలో పెసర వెల పెరగబోతున్నట్టు సమాచారం అందింది. తొందరపడి నీ పంటంతా చవగ్గా అమ్మేయకు. ఈ సంగతి ఎవరికీ చెప్పకు' అన్నాడు భూషయ్య.

కొంతదూరం వెళ్ళాక మరో వ్యక్తి కనిపిస్తే అతన్ని పక్కకు పిలిచి, ముందు వ్యక్తికి చెప్పినట్టే చెప్పాడు భూషయ్య. త్రోవ పొడవునా మరో అరడజనుమందికి అలాగే చెప్పాడు.

అదంతా గమనిస్తూన్న కమల విస్తుపోతూ, అదేంటి నాన్నా, ఎవరికీ చెప్పొద్దంటూ అందరికీ నువ్వే చెప్పేసావు?' అనడిగింది. భూషయ్య నవ్వి, 'రహస్యమంటే ఇదేనమ్మా. ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్కరికే చాటుగా చెప్పేదే రహస్యం!' అన్నాడు. 'సమాచారమంటే బాహాటంగా పదిమందికీ తెలియపరచేది. నువ్వు రచ్చబండకు వార్త మోసుకుపోలా? అదన్నమాట.'

'రహస్యమంటే ఇదా!' అంటూ బుర్ర గోక్కుంది కమల. భూషయ్య నవ్వి, కొబ్బరిబొండాలు దింపించి తీయటి కొబ్బరినీటిని కమలకు ఇప్పించాడు.

Read More
Published July 15, 2023 by

పనికిరాని సాధనం

ఒక కుందేలు ఒక కొక్కిరాయి వద్దకు వచ్చి, 'నీవు కట్టుడు పళ్లు బాగా కడతావుట. నాకు రెండు మంచి దంతాలు కట్టు, అన్నది.


'నీ పళ్లన్నీ బాగానే ఉన్నాయే,' అన్నది కొక్కిరాయి.

‘బాగా లేవని కాదు. నాకు ఇంకా పొడుగైన కోరలు. సింహం కోరల్లాంటివి కావాలి',

అన్నది కుందేలు.

‘దేనికీ?’ అని కొక్కిరాయి అడిగింది.


‘నక్కను భయపెట్టడానికి, దానితో వేగలేకుండా ఉన్నాను. దాన్ని చూసినప్పుడల్లా పారిపోవలసి వస్తున్నది. ఈ దెబ్బతో అదే నన్ను చూసి పారిపోవాలి' అన్నది కుందేలు.


కొక్కిరాయి తనలోనే నవ్వుకుని కుందేలుకు రెండు భయంకరమైన కోరలు అమర్చింది. కుందేలు అద్దంలో చూసుకుని, 'అద్భుతం! ఇప్పుడు చెబుతాను నక్క పని!’ అని నక్కను వెతుకుతూ బయలుదేరింది.


అది ఎంతో దూరం పోకుండానే ఒక పొద చాటున పొంచి చూస్తున్న నక్క కనిపించింది. కుందేలు అదురుకుని, శరవేగంతో కొక్కిరాయి వద్దకు తిరిగి వచ్చి, 'అన్నా, ఈ కోరలు తీసేసి, ఇంతకన్న భయంకరంగా ఉండేదేమైనా అమర్చగలవా?' అని అడిగింది.


‘మార్చవలసినది నీ దంతాలు కావు నీ పిరికి గుండె! దాన్ని తీసేసి గట్టిగుండె అమర్చినప్పుడు గాని, నీ సమస్య తీరదు,' అన్నది కొక్కిరాయి.


Read More
Published July 15, 2023 by

పనివాడు

రాఘవాపురంలో ఇరవై ఎకరాల ఆసామి రామచంద్రుడు. రామచంద్రుడిది సువిశాలమైన ప్రాంగణం మధ్యలో ఓ మోస్తరు ఇల్లు. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో రకరకాల పూలమొక్కలు, పండ్ల చెట్లు పచ్చదనంతో కళకళలాడేవి. రామచంద్రుడి దగ్గర తోటమాలిగా ఉన్న వీరయ్య కాలం చేయడంతో కొత్త పనివాడు అవసరమయ్యాడు. ఇది తెలిసి ఒకరోజు ఉదయానే సీతయ్య, కాశయ్య అనే యువకులు ఆయన దగ్గరకొచ్చారు.

ఇద్దరి వివరాలనడిగిన రామచంద్రుడు, తాను ఒక ముఖ్యమైన పనిపై పట్నం వెళుతున్నానని, మరుసటి రోజు ఉదయం కనిపించమని చెప్పి తన గుర్రబ్బగ్గీ మీద వెళ్లిపోయాడు. సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి ఆయన ఇంటికి చేరాడు. ప్రధానద్వారం దగ్గర సీతయ్య మట్టిని సరిచేస్తూ దారికడ్డంగా అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న రాళ్లను ఏరి పారవేస్తూ కన్పించాడు. రామచంద్రయ్య బగ్గీని నిలిపి,' పైన ఎండ మండిపోతోంది. రేపు ఉదయాన్నే కనిపించమన్నానుగా. ఇక్కడేం చేస్తున్నావు!' అని అడిగాడు.

సీతయ్య వినయంగా లేచి నిలబడి 'అయ్యా! ఉదయం తమరు బగ్గీలో పోతున్నప్పుడు గుర్రం కాలు జారి ఇక్కడున్న చిన్న గుంతలో పడి బగ్గీ మొత్తం అదిరింది. ప్రమాదాలు చెప్పిరావు. అందుకే దానిని సరిచేస్తున్నానయ్యా!' అన్నాడు భయపడుతూ.

రామచంద్రయ్య ‘కాశయ్య నా మాటకు విలువనిచ్చి వెళ్లిపోయాడు. అదీ మంచి పనే. అయితే సీతయ్య నా క్షేమం కాంక్షించాడు. ఉపాధి కోసం చేసే పనిని ప్రేమించడంతో పాటు అన్నం పెట్టే యజమాని మేలు కోరేవాడే అసలు సిసలయిన పనిమంతుడు. ఇటువంటివారే చేసే పనిపట్ల నిబద్ధత, కలిగి ఉంటారు” అని ఆలోచించి సీతయ్యను తోటమాలిగా తీసుకున్నాడు.

Read More
Published July 15, 2023 by

బిచ్చగాడి నిధి

ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పని చేసి అలిసిపోయి, ఇంటికి వచ్చి, నడుము వాల్చి,‘ఓ దేవుడా! నాకొక చిన్న నిధి ఇవ్వలేవా?' అని ప్రార్థన చేశాడు.

అకస్మాత్తుగా అతని ముందొక సంచీ పడింది. మరుక్షణమే అతనికి ఇలా వినబడింది:‘ఈ సంచీలో నీకు బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. తడవకు ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణేలైనా దొరుకుతాయి. నీకు చాలినన్ని తీసుకున్నాక, ఈ సంచీని నదిలో పారెయ్యి, అయితే ఒక్కటి గుర్తుంచుకో, సంచీని నదిలో

పారేసేదాకా నువ్వా డబ్బును ఖర్చు చేయరాదు. అలా ఖర్చు చేశావో, నువు తీసిన డబ్బు యావత్తూ మాయమవుతుంది. '


రైతు పరమానందం చెంది, ఆ రాత్రల్లా సంచీలో నుంచి బంగారు నాణాలు తీసి, ఒక గోతం నింపాడు. మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు. సంచీని నదిలో పారేసిన దాకా బంగారాన్ని వాడటానికి లేదు. ఇంకొక్క రాత్రి అంతా కూర్చుని ఇంకొక గోతం నింపి, తరువాత సంచీని నదిలో పారేద్దామనుకున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. గోతాలు బంగారు నాణాలతో నిండుతున్నాయి. రైతు రోజూ బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు. చివరకు ఒకనాడు అతను చనిపోయాడు. ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి చూసి ఆ బిచ్చగాడి ఇంటి నిండా గోతాల కొద్దీ బంగారు నాణాలుండటం చూసి నిర్ఘాంతపోయారు.


Read More
Published June 21, 2023 by

రామాయణం - కావ్య విభాగాలు


రామాయణ మహాకావ్యము ఏడు కాండములు (భాగములు) గా విభజింప బడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు, మొత్తం 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు).ఏడవ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు.

  • బాల కాండ (77 సర్గలు): కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
  • అయోధ్య కాండ (119 సర్గలు): కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము
  • అరణ్య కాండ (75 సర్గలు): వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము
  • కిష్కింధ కాండ (67 సర్గలు): రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
  • సుందర కాండ (68 సర్గలు): హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
  • యుద్ధ కాండ(131 సర్గలు): సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
  • ఉత్తర కాండ: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)
Read More
Published June 21, 2023 by

రామాయణం - యుద్ధకాండ



హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.


అక్కడ లంకలో రావణుడు యుద్ధము విషయమై తనవారితో చర్చింపసాగాడు. అతని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది. అయిదు దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి పూర్తికాగా, వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి, రామకార్యానికి సన్నద్ధమై ఉంది.


రావణుని చారుల వల్ల తెలిసిన సమాచారం ప్రకారం వానర సేనా, రామలక్ష్మణులూ అజేయులు, అసమానులు. కనుక యుద్ధం వినాశనహేతువని కొందరు ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ - వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరనీ, కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడూ, తనూ యుద్ధానికి రావలసిన అవుసరమే రాదనీ రావణుడి విశ్వాసం.

 

ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది.

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధంతో భునభోంతరాళాలు కంపిస్తున్నాయి. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.


మరునాడు హనుమంతుని చేత ధూమ్రాక్షుడూ, అంగదుని చేత వజ్రదంష్ట్రుడూ, నీలునిచేత ప్రహస్తుడూ హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు.అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు.


అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో రక్షసులు కూడా నశించారు.


శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు, మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు - అందరూ మహా శూరులు- భీకరమైన యుద్ధానికి దిగారు. వారు అంగదుని, హనుమంతుని, లక్ష్మణుని చేత హతులయ్యారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. ఎలాగో తెలివి తెచ్చుకొన్న జాంబవంతుడు హిమవత్పర్వతాలలో నున్న ఓషధులు తెమ్మని హనుమకు పురమాయించాడు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు.


ఇంద్రజిత్తు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సాధించడానికి నికుంభిలా యజ్ఙం ఆరంభించాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, యజ్ఙాన్ని భంగం చేసి యద్ధానికి తలపడ్డాడు. ఆ భీకర సమరంలో ఆకాశాన్ని బాణాలు కప్పివేశాయి. చివరకు రాముని పేరు చెప్పి సౌమిత్రి సంధించిన ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తు తల తెగిపడింది.


ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. సుగ్రీవుని చేత మహోదరుడు మరణించాడు. రావణుని మహోగ్రశరధాటికివానర సైన్యము ఛిన్నాభిన్నమైనది. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు.. అప్పుడు రాముడు తనవారిన ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను" అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. లక్ష్మణుడు కేవలం మూర్ఛిల్లాడని ధైర్యం చెప్పి సుషేణుడు మరల హనుమను మరల గిరిశిఖరానికి వెళ్ళమన్నాడు. హనుమంతుడు శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు".


రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.


రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.


అనంతరం సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది.

Read More
Published June 21, 2023 by

రామాయణం - సుందరకాండ


హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధపడలేక ఆత్మహత్యకు కూడా ఉపక్రమించబోతుండగా అశోక వనం కనిపిస్తుంది.


రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.


అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.


వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.


ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.


హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.


ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.


"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.

Read More
Published June 21, 2023 by

రామాయణం - కిష్కింధకాండము



సుగ్రీవుడు వానరరాజు. అన్న యైన వాలితో దురదృష్టవశాత్తు విరోధము సంభవించగా సుగ్రీవుడు హనుమదాది అనుచరులతోడుగా ఋష్యమూకపర్వతంపై ప్రాణభయంతో కాలం గడుపుతున్నాడు.

హనుమంతుడు రామలక్ష్మణులను కలసి, సుగ్రీవునివద్దకుతోడ్కొని వెళ్ళాడు.రాముడూ, సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిధుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు.

వారు అంతా కలయజూస్తూ, అనేక అవాంతరాలను అధిగమించి, స్వయంప్రభ అనే యోగిని సాయంతో దక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఆపై దిక్కు తోచకవారు శోకంలో మునిగిపోయిన వారికి జటాయువు సోదరుడైన సంపాతి కనిపించి, రావణుడు సీతను అపహరించి లంకలో దాచాడని చెప్పాడు.

ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకెలా వెళ్ళాలో తెలియక వానరులు తర్జన భర్జనలు పడసాగారు. అప్పుడు జాంబవంతుడు ఈ కార్యానికి హనుమంతుడే సమర్ధుడనీ, హనుమకు అసాధ్యమైన పని లేదనీ ధైర్యం చెప్పాడు. తన శక్తి తెలిసికొన్న హనుమంతుడు మహాతేజంతో ప్రకాశించాడు.

Read More
Published June 21, 2023 by

రామాయణం - అరణ్యకాండ



శాపవశమున విరాధుడనే రాక్షసుడైన తుంబురుడు రామ లక్ష్మణులచేత శాపవిమోచనం పొందాడు. తరువాత సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడు, అగస్త్యుడు వంటి మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరీ తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి ఆమె సోదరులైన ఖర దూషణులనే రాక్షసులు 14 వేల మంది రాక్షసులతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరిని హతం చేసాడు.


శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. అడ్డు వచ్చిన జటాయువు రెక్కలు తెగనరికాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు.


దుఃఖంతో సీతను వెతుకుతున్న రామలక్ష్మణులకు కబంధుడనే రాక్షసుడు ఎదురయ్యాడు. వాడు శాపవిమోచనం పొందుతూ సుగ్రీవునితో మైత్రి చేసుకోమని చెప్పాడు. ఆపై రామలక్ష్మణులు మతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు.

Read More