Published June 21, 2023 by

రామాయణం - కావ్య విభాగాలు


రామాయణ మహాకావ్యము ఏడు కాండములు (భాగములు) గా విభజింప బడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు, మొత్తం 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు).ఏడవ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు.

  • బాల కాండ (77 సర్గలు): కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
  • అయోధ్య కాండ (119 సర్గలు): కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము
  • అరణ్య కాండ (75 సర్గలు): వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము
  • కిష్కింధ కాండ (67 సర్గలు): రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
  • సుందర కాండ (68 సర్గలు): హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
  • యుద్ధ కాండ(131 సర్గలు): సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
  • ఉత్తర కాండ: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)
Read More
Published June 21, 2023 by

రామాయణం - యుద్ధకాండ



హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.


అక్కడ లంకలో రావణుడు యుద్ధము విషయమై తనవారితో చర్చింపసాగాడు. అతని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది. అయిదు దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి పూర్తికాగా, వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి, రామకార్యానికి సన్నద్ధమై ఉంది.


రావణుని చారుల వల్ల తెలిసిన సమాచారం ప్రకారం వానర సేనా, రామలక్ష్మణులూ అజేయులు, అసమానులు. కనుక యుద్ధం వినాశనహేతువని కొందరు ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ - వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరనీ, కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడూ, తనూ యుద్ధానికి రావలసిన అవుసరమే రాదనీ రావణుడి విశ్వాసం.

 

ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది.

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధంతో భునభోంతరాళాలు కంపిస్తున్నాయి. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.


మరునాడు హనుమంతుని చేత ధూమ్రాక్షుడూ, అంగదుని చేత వజ్రదంష్ట్రుడూ, నీలునిచేత ప్రహస్తుడూ హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు.అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు.


అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో రక్షసులు కూడా నశించారు.


శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు, మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు - అందరూ మహా శూరులు- భీకరమైన యుద్ధానికి దిగారు. వారు అంగదుని, హనుమంతుని, లక్ష్మణుని చేత హతులయ్యారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. ఎలాగో తెలివి తెచ్చుకొన్న జాంబవంతుడు హిమవత్పర్వతాలలో నున్న ఓషధులు తెమ్మని హనుమకు పురమాయించాడు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు.


ఇంద్రజిత్తు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సాధించడానికి నికుంభిలా యజ్ఙం ఆరంభించాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, యజ్ఙాన్ని భంగం చేసి యద్ధానికి తలపడ్డాడు. ఆ భీకర సమరంలో ఆకాశాన్ని బాణాలు కప్పివేశాయి. చివరకు రాముని పేరు చెప్పి సౌమిత్రి సంధించిన ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తు తల తెగిపడింది.


ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. సుగ్రీవుని చేత మహోదరుడు మరణించాడు. రావణుని మహోగ్రశరధాటికివానర సైన్యము ఛిన్నాభిన్నమైనది. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు.. అప్పుడు రాముడు తనవారిన ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను" అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. లక్ష్మణుడు కేవలం మూర్ఛిల్లాడని ధైర్యం చెప్పి సుషేణుడు మరల హనుమను మరల గిరిశిఖరానికి వెళ్ళమన్నాడు. హనుమంతుడు శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు".


రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.


రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.


అనంతరం సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది.

Read More
Published June 21, 2023 by

రామాయణం - సుందరకాండ


హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధపడలేక ఆత్మహత్యకు కూడా ఉపక్రమించబోతుండగా అశోక వనం కనిపిస్తుంది.


రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.


అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.


వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.


ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.


హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.


ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.


"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.

Read More
Published June 21, 2023 by

రామాయణం - కిష్కింధకాండము



సుగ్రీవుడు వానరరాజు. అన్న యైన వాలితో దురదృష్టవశాత్తు విరోధము సంభవించగా సుగ్రీవుడు హనుమదాది అనుచరులతోడుగా ఋష్యమూకపర్వతంపై ప్రాణభయంతో కాలం గడుపుతున్నాడు.

హనుమంతుడు రామలక్ష్మణులను కలసి, సుగ్రీవునివద్దకుతోడ్కొని వెళ్ళాడు.రాముడూ, సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిధుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు.

వారు అంతా కలయజూస్తూ, అనేక అవాంతరాలను అధిగమించి, స్వయంప్రభ అనే యోగిని సాయంతో దక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఆపై దిక్కు తోచకవారు శోకంలో మునిగిపోయిన వారికి జటాయువు సోదరుడైన సంపాతి కనిపించి, రావణుడు సీతను అపహరించి లంకలో దాచాడని చెప్పాడు.

ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకెలా వెళ్ళాలో తెలియక వానరులు తర్జన భర్జనలు పడసాగారు. అప్పుడు జాంబవంతుడు ఈ కార్యానికి హనుమంతుడే సమర్ధుడనీ, హనుమకు అసాధ్యమైన పని లేదనీ ధైర్యం చెప్పాడు. తన శక్తి తెలిసికొన్న హనుమంతుడు మహాతేజంతో ప్రకాశించాడు.

Read More
Published June 21, 2023 by

రామాయణం - అరణ్యకాండ



శాపవశమున విరాధుడనే రాక్షసుడైన తుంబురుడు రామ లక్ష్మణులచేత శాపవిమోచనం పొందాడు. తరువాత సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడు, అగస్త్యుడు వంటి మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరీ తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి ఆమె సోదరులైన ఖర దూషణులనే రాక్షసులు 14 వేల మంది రాక్షసులతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరిని హతం చేసాడు.


శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. అడ్డు వచ్చిన జటాయువు రెక్కలు తెగనరికాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు.


దుఃఖంతో సీతను వెతుకుతున్న రామలక్ష్మణులకు కబంధుడనే రాక్షసుడు ఎదురయ్యాడు. వాడు శాపవిమోచనం పొందుతూ సుగ్రీవునితో మైత్రి చేసుకోమని చెప్పాడు. ఆపై రామలక్ష్మణులు మతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు.

Read More
Published June 21, 2023 by

రామాయణం - అయోధ్యా కాండము



దశరథుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి.


రాముని సవతి తల్లియైన కైకేయికి రాముడంటే ఎంతో వాత్సల్యము. కాని ఆమె చెలికత్తె మంధర కైకేయికి ఇలా నూరిపోసింది - "రాముడు రాజయితే కౌసల్య రాజమాతవుతుంది. నీ స్థానం బలహీనపడుతుంది. కనుక భరతుని రాజుగా చేసి, రాముని దూరంగా పంపే మార్గం ఆలోచించు.". ఈ మాటలు కైకేయి వంటబట్టాయి. అంతకు పూర్వము దశరధుడు ఆమెకు రెండు కోరికలు ప్రసాదించాడు. వాటిని గుర్తు చేస్తూ ఆమె దశరధుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము.


దశరథునకు ఎటూ పాలుపోలేదు. దుఃఖంతో క్రుంగిపోయాడు. కాని రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి కృతనిశ్చయుడై ఉన్నాడు. రామునితోబాటు ఆత్మయైన సీత, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. అయోధ్యపురవాసులంతా విలపించారు.అందరివద్దా సెలవు తీసుకొని సీతారామలక్ష్మణులు సకలసౌఖ్యాలూ వర్జించి, నారదుస్తులు ధరించి వనవాస దీక్షకు సిద్ధమైనారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. అక్కడ దశరధుడు రామునికై విలపిస్తూ స్వర్గతుడైనాడు.


మేనమామల ఇంటినుండి అయోధ్యకు వచ్చిన భరతుడు తల్లి చేసిన పనికి మండిపడ్డాడు. ఆమె ముఖం చూడడానికీ, తన ముఖం ఇతరులకు చూపడానికీ అతని మనసొప్పలేదు. సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.


సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించింది.

Read More
Published June 21, 2023 by

రామాయణం - బాలకాండము



అయోధ్య నగరం రాజధానిగా, కోసలదేశాన్ని రఘువంశీ వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు.కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు.


రావణుడు అనే వాడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు.


కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. ముక్కుపచ్చలారని నవయువకులను పంపడానికి దశరథుడు సంకోచించినా, వశిష్ఠుని సలహామేరకు విశ్వామిత్రునితో పంపాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది.


రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగింది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలసి జనకుని రాజధానియైన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శ్రుతకీర్తి శత్రుఘ్నుల వివాహం కనుల పండుగగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామునకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసింది.


మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యలో పాలన నిత్యకల్యాణముగా సాగుతున్నది.

Read More