రాఘవాపురంలో ఇరవై ఎకరాల ఆసామి రామచంద్రుడు. రామచంద్రుడిది సువిశాలమైన ప్రాంగణం మధ్యలో ఓ మోస్తరు ఇల్లు. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో రకరకాల పూలమొక్కలు, పండ్ల చెట్లు పచ్చదనంతో కళకళలాడేవి. రామచంద్రుడి దగ్గర తోటమాలిగా ఉన్న వీరయ్య కాలం చేయడంతో కొత్త పనివాడు అవసరమయ్యాడు. ఇది తెలిసి ఒకరోజు ఉదయానే సీతయ్య, కాశయ్య అనే యువకులు ఆయన దగ్గరకొచ్చారు.
ఇద్దరి వివరాలనడిగిన రామచంద్రుడు, తాను ఒక ముఖ్యమైన పనిపై పట్నం వెళుతున్నానని, మరుసటి రోజు ఉదయం కనిపించమని చెప్పి తన గుర్రబ్బగ్గీ మీద వెళ్లిపోయాడు. సూర్యుడు నడినెత్తికొచ్చేసరికి ఆయన ఇంటికి చేరాడు. ప్రధానద్వారం దగ్గర సీతయ్య మట్టిని సరిచేస్తూ దారికడ్డంగా అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న రాళ్లను ఏరి పారవేస్తూ కన్పించాడు. రామచంద్రయ్య బగ్గీని నిలిపి,' పైన ఎండ మండిపోతోంది. రేపు ఉదయాన్నే కనిపించమన్నానుగా. ఇక్కడేం చేస్తున్నావు!' అని అడిగాడు.
సీతయ్య వినయంగా లేచి నిలబడి 'అయ్యా! ఉదయం తమరు బగ్గీలో పోతున్నప్పుడు గుర్రం కాలు జారి ఇక్కడున్న చిన్న గుంతలో పడి బగ్గీ మొత్తం అదిరింది. ప్రమాదాలు చెప్పిరావు. అందుకే దానిని సరిచేస్తున్నానయ్యా!' అన్నాడు భయపడుతూ.
రామచంద్రయ్య ‘కాశయ్య నా మాటకు విలువనిచ్చి వెళ్లిపోయాడు. అదీ మంచి పనే. అయితే సీతయ్య నా క్షేమం కాంక్షించాడు. ఉపాధి కోసం చేసే పనిని ప్రేమించడంతో పాటు అన్నం పెట్టే యజమాని మేలు కోరేవాడే అసలు సిసలయిన పనిమంతుడు. ఇటువంటివారే చేసే పనిపట్ల నిబద్ధత, కలిగి ఉంటారు” అని ఆలోచించి సీతయ్యను తోటమాలిగా తీసుకున్నాడు.